రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజూ శాంసన్ మధ్య పొసగడం లేదని, ఈ ఇద్దరికీ అస్సలు పడటం లేదంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఐతే ఆ కూతలకు, ఆ వార్తలకు చెక్ పెట్టేశాడు రాహుల్ ద్రవిడ్. తమ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉందంటూ..టీమ్ నిర్ణయాల్లో సంజూ శాంసన్ పాత్ర ఉండటం లేదంటూ వచ్చిన వార్తలను ఖండించాడు. సంజూతో తనకు ఎప్పట్నుంచో మంచి ర్యాపో ఉందని చెప్పాడు. టీమ్ తీసుకునే ప్రతీ నిర్ణయాల్లో సంజూ భాగస్వామ్యం ఉంటుందని..అదే కొనసాగుతోందని తెలిపాడు. మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు విమర్శలు కచ్చితంగా వస్తాయని, వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధమే అన్నాడు. కొన్నిసార్లు నిర్ణయాలు మనకు కలిసిరావని, కొన్నిసార్లు కలిసొస్తాయని…పొరపాట్ల నుంచి నేర్చుకుని ముందుకు సాగిపోవడమే తమ కర్తవ్యమని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాకు తెలిపాడు.
ఇంతకీ ఆ రూమర్స్ ఏంటి.?
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ డగౌట్లో జరిగిన ఒక సన్నివేశం..ఈ వార్తలకు కారణమైంది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగి..అందులో ఢిల్లీ గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే సూపర్ ఓవర్‌కు ముందు సంజూ పక్కటెముకల నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు..ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ..ఢిల్లీ టార్గెట్‌ను సమం చేసి..మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఆ తర్వాత రాయల్స్ డగౌట్ దగ్గర హెడ్ కోచ్ ద్రవిడ్ టీమ్ సభ్యులతో మాట్లాడుతుంటే..కెప్టెన్ సంజూ మాత్రం ఏమీ పట్టనట్టు కొంచెం దూరంగా ఉన్నాడు. ఒక ఆటగాడు రమ్మని పిలిచినప్పటికీ రానంటూ సంజూ చేతులూపాడు…ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి..ద్రవిడ్, సంజూ మధ్య సఖ్యత లేదని, రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా చేసేందుకే ఇదంతా జరుగుతోందని ప్రచారం మొదలైంది. నిజానికి సంజూ నొప్పి తగ్గకపోతే..తర్వాత మ్యాచ్‌లో పరాగ్ కెప్టెన్సీ చేయడం ఖాయం..మరి అప్పుడు ఈ వార్తలు మరింత ఊపందుకోవడం గ్యారెంటీ.