డర్ కె ఆగే జీత్ హై..అనేది యాడ్స్‌లో వింటుంటాం, చూస్తుంటాం. అంటే భయాన్ని దాటితేనే గెలుపు అని అర్థం. ఐతే ప్రస్తుత ఐపీఎల్ పరిభాషలో దీన్ని చెప్పాలంటే…యార్కర్ కె ఆగే జీత్ హై..అంటే యార్కర్స్‌ను బ్యాటర్లు అధిగమిస్తేనే తమ టీమ్‌ను గెలిపించగలరు, కానీ అవకాశాలు చాలా తక్కువ. ఇక బౌలర్లు సమర్థవంతంగా యార్కర్లు వేయగలిగితే తమ టీమ్‌ను కచ్చితంగా గెలిపించగలరు, దీనికి అవకాశాలు ఎక్కువ. రీసెంట్ గేమ్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న మిచెల్ స్టార్క్ రాజస్థాన్ రాయల్స్‌పై యార్కర్స్ వేసి ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేశాడు. అంతేకాదు సూపర్ ఓవర్‌లో తమ టీమ్ గెలిచేలా చేశాడు. ఇక మరో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అవేశ్‌ఖాన్ 6 బాల్స్‌లో 9 రన్స్ అవసరమైన టైమ్‌లో యార్కర్లు సంధించి రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించాడు. పాపం రెండు సందర్భాల్లోనూ బాధిత టీమ్ రాజస్థాన్ రాయల్స్.
స్టార్క్, ఆవేశ్ ఖాన్ మాత్రమే కాదు..గత మ్యాచుల్లో గెలిపించారు కాబట్టి ఈ ఇద్దరు బౌలర్ల గురించి ప్రస్తావించాం గానీ.. యార్కర్లు సంధించే బౌలర్లు చాలా మందే ఉన్నారు. అందరికంటే ముందుగా ఉండేది జస్ప్రిత్ బుమ్రా.. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన బుమ్రా యార్కర్లు వేయడంలో ఎక్స్‌పర్ట్. ముంబై ఇండియన్స్‌కు కూడా అతడే సగం బలం..అతడికి యార్కర్లే సగానికి పైగా బలం. ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ యార్కర్స్ వేయడంలో మాస్టర్స్ చేశాడు.
ఇక మిగతా టీమ్స్ విషయానికొస్తే..గతంలో సన్‌రైజర్స్ తరపున ఆడిన టి. నటరాజన్ కూడా యార్కర్స్ వేయడంలో సిద్ధహస్తుడే. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినథ్యం వహిస్తున్నాడు.సన్‌రైజర్స్ టీమ్‌లో ఎషాన్ మలింగ కూడా యార్కర్స్ వేస్తున్నాడు. ఫారిన్ పేసర్లలో జోఫ్రా ఆర్చర్..నోకియా, రబాడ కూడా ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడతారు.
ఇండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ గత సీజన్‌లో ఆండ్రె రసెల్‌ను యార్కర్‌తో బౌల్డ్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఔటైన తర్వాత రసెల్ కూడా ఇషాంత్‌ను ప్రశంసిస్తూ డగౌట్‌కి వెళ్లాడు. అదన్నమాట యార్కర్ స్పెషాలిటీ. మరి ఈ సీజన్ ఐపీఎల్‌లో రాను రాను మరెన్ని మ్యాచ్ విన్నింగ్ యార్కర్స్ చూస్తామో..తలుచుకుంటేనే థ్రిల్లింగ్‌గా ఉంది కదా..