ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే.. నాలుగు మ్యాచ్‌లలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. కోల్‌కతా వేదికగా కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ జరగ్గా.. ఆర్సీబీ తరఫున కృనాల్ పాండ్య తొలి మ్యాచ్ ఆడాడు. గతంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన కృనాల్‌ను ఈ ఏడాది మెగా వేలంలో ఆర్సీబీ రూ.5.75 కోట్లకు దక్కించుకుంది. బ్యాటింగ్‌లో అవకాశం రాకపోయినా బౌలింగ్‌లో కృనాల్ రాణించాడు. 4 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి కేకేఆర్ స్కోరును నియంత్రించాడు. దీంతో మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇక హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్‌హెచ్-ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్‌గా రాణించిన ఇషాన్‌ను ఈ ఏడాది మెగావేలంలో హైదరాబాద్ జట్టు రూ.11.25 కోట్లకు దక్కించుకుంది. అభిషేక్, హెడ్ లాంటి విధ్వంసక ఓపెనర్లు ఉండటంతో వన్‌డౌన్‌లో ఇషాన్ వెళ్లాల్సి వచ్చింది. అయినా తగ్గేదే లే అంటూ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసి ఔరా అనిపించాడు. 47 బాల్స్‌లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 రన్స్‌తో అజేయంగా నిలిచి తన జట్టుకు 286 పరుగుల భారీ స్కోరు అందించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు.
మరోవైపు చెన్నై వేదికగా CSK-MI మధ్య జరిగిన మ్యాచ్ కూడా అభిమానులను అలరించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన ఈ ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ ఈ ఏడాది మెగా వేలంలో చెన్నై జట్టుకు వచ్చాడు. రూ. 10 కోట్లకు CSK అతడిని సొంతం చేసుకుంది.
ఇక విశాఖ వేదికగా DC-LSG మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారింది. ఇందులోనూ అరంగేట్ర ఆటగాడు రాణించాడు. అతడే అశుతోష్ శర్మ. గతంలో పంజాబ్ కింగ్స్ తరఫున సంచలన ఇన్నింగ్స్‌లను ఆడిన అనుభవం ఉంది. ఈ ఏడాది మెగా వేలంలో అతడిని ఢిల్లీ రూ.3.8 కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అశుతోష్ విశాఖ మ్యాచ్‌లో ఓటమి అంచుల్లో ఉన్న తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. 210 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో తన జట్టు 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా ఏ మాత్రం బెదరకుండా ఆడిన అశుతోష్ 31 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 రన్స్ చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు.