ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు హాట్ టాపిక్ అయ్యాడు, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ అండర్సన్. ఐపీఎల్ ఆక్షన్ కోసం తన పేరును రిజిస్టర్ చేసుకోవడమే ఇందుకు కారణం. తన బేస్ ప్రైస్‌ను రూ.1.25 కోట్లుగా రిజిస్టర్ చేసుకున్నాడు. 42 ఏళ్ల వయసున్న అండర్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయి సంవత్సరం కూడా కాలేదు. జులై 12, 2024లో వెస్టిండీస్‌పై లార్ట్స్‌లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం తన జట్టు ఇంగ్లండ్‌కే బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇవన్నీ పక్కనపెడితే గతంలో ఎప్పుడూ ఐపీఎల్‌లో ఆడనే లేదు. అన్నిటికీ మించి తను ఇంటర్నేషనల్ టీ20లు కూడా ఆడింది తక్కువే..అందులోనూ పెర్ఫార్మెన్స్ మరీ అంత ఇంప్రెసివ్‌గా లేదు. ఇంగ్లండ్ తరపున 19 టీ20 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీశాడు. ఎకానమీ 7.84గా ఉంది.
టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు అండర్సన్. తన రిటైర్మెంట్‌కు ముందే 700 వికెట్ల మార్క్ దాటాడు. 188 మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ 704 వికెట్లు తీశాడు. ఇక వన్డేల్లో 194 మ్యాచ్‌లు ఆడి 269 వికెట్లు తీశాడు. ఏదేమేనా .. కోచింగ్ ఇస్తున్న వయసులో ఐపీఎల్ ఆడాలనే కోరిక చూస్తుంటే అభిమానులకైతే ముచ్చటేస్తుంది. మరి ఆక్షన్‌లో ఇతడిని ఎవరైనా తీసుకుంటారా? తతీసుకుంటే బేస్ ప్రైస్‌కే (రూ.1.25 కోట్లు) తీసుకుంటారా లేదంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోతాడా అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. డాడీ ఆర్మీ అని పేరున్న సీఎస్కే తీసుకుంటుందంటూ సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తోంది. చూడాలి అండర్సన్ అన్‌సోల్డ్‌గా ఉంటాడా? ఆశ్చర్యపరుస్తాడా?