కాదా మరి..ఎంతటి చరిత్ర, ఎంతటి వైభం. అందనంత ఎత్తు నుంచి ఒక్కసారిగా అట్టడుగు పాతాళానికి పడిపోయింది ఇండియా టెస్ట్ క్రికెట్. అది కూడా మన సొంతగడ్డపై, తిరుగులేని రికార్డు ఉన్నా..అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నా..న్యూజిలాండ్ చేతిలో చావు దెబ్బతిన్నది. పక్కనున్న దేశం శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడి వచ్చిన కివీస్..ఇండియాకు ఈ రేంజ్‌లో షాక్ ఇస్తుందని ప్రపంచంలోనే ఏ ఒక్కరూ ఊహించలేదు. వరుసగా 18 సిరీస్‌లు గెలుస్తూ వచ్చిన ఇండియా ఈ సిరీస్‌నూ కూడా ఈజీగా గెలుస్తుందనుకున్నారు..కానీ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టీమిండియా సొంతగడ్డపై 0-3తో సిరీస్ ఓడిపోయి అపకీర్తి మూటగట్టుకుంది. కెప్టెన్ రోహిత్‌శర్మ కెరియర్‌లో ఇదొక మాయని మచ్చగా మిగిలిపోనుంది, అది కూడా తన సొంత గ్రౌండ్ వాంఖడేలో
మొదటి టెస్ట్ బెంగళూరులో ఓటమి, సరే మిగతా రెండిట్లో గెలుస్తాం అనుకున్నాం..రెండో టెస్ట్ పుణెలో అదీ ఓడిపోయాం..సిరీస్ కోల్పోయాం. కనీసం పరువు కాపాడుకుంటామనుకున్నాం..హవ్వ చిత్తుచిత్తుగా ఓడిపోయాం. 147 రన్స్ టార్గెట్ ను కొట్టలేకపోయామే..కెప్టెన్ రోహిత్ అవలీలగా కొట్టగల రన్స్ ఇవి..జైస్వాల్ ఆడుతు పాడుతూ ఇందులో సగమైన కొట్టగల కెపాసిటి..కింగ్ కోహ్లీకి ఈ రన్స్ ఒక లెక్క కావు.. గిల్ నిలబడితే కనీసం యాభై రన్స్ అయిన వస్తాయి..కానీ టాపార్డర్‌కు ఏమైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టుమని పది నిమిషాలు క్రీజులో ఉండలేకపోయారు..కనీసం పది పరుగులు చేయలేకపోయారు. పాపం పంత్ ఒక్కడే ఆడాడు, దాదాపు సగం రన్స్ స్కోర్ చేశాడు. ఎవరూ సపోర్ట్ చేయకపోతే, తాను మాత్రం ఏం చేస్తాడు. ఓడిపోవడం వదిలేద్దాం, ఓడిపోయినా విధానం గురించే చర్చ అవసరం.
స్పిన్ ఆడటంలో మనం తోపులం..సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ , సెహ్వాగ్, గంగూలీ, వీళ్లంతా షేన్‌వార్న్, మురళీధరన్, సక్లైన్ ముస్తాక్ వంటి స్పిన్నర్లను ఆటాడుకున్నవాళ్లే.. కానీ ఇప్పుడున్న బ్యాటర్లకు ఏమైంది. ఫారిన్ స్పిన్నర్లు మన గడ్డపై దడ పుట్టించేంత రేంజ్‌కు ఎదిగారా? లేక స్పిన్ అంటేనే దడుచుకునే స్థాయికి మన బ్యాటర్లు పడిపోయారా?..ఇలా అనుకుంటూ పోతే అభిమానుల గుండెలు పగిలిపోతూనే ఉంటాయి. మన బ్యాటర్లు స్పిన్ ఆడటంలో లోపాలను సరిచేసుకుని పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేం.