అబ్బా..మళ్లీ ఇది కూడా సిరీస్ వైట్ వాష్ గురించే కదా. ఔను తప్పదు, ఇది ఇండియా కదా..మిగతా దేశాల్లోలాగా ఇక్కడ క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు, నరాల్లో ప్రవహించే రక్తం లాంటింది. తగిలింది చిన్నదెబ్బ కాదుకదా, అందుకే అన్నింటినీ పరిశీలించాలి. ఇక అసలు విషయానికొస్తే.. ఒక్క రోజులో 400 కొడతం..టెస్ట్ మ్యాచ్ గెలుపు కోసమే ఆడతాం, డ్రా కోసం కాదు..ఇలా ఇంకా ఎన్నెన్నో చెప్పాడు కోచ్ గౌతమ్ గంభీర్.
తీరా ఇప్పుడు సీన్ ఏంట్రా అని చూస్తే..చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోర అవమాన పరాభవం. 0-3తో సొంతగడ్డపై ప్రత్యర్థి క్లీన్‌స్వీప్ చేసింది. దీనికి కచ్చితంగా కోచ్ గంభీర్‌నే ఓ నాలుగు మాటలు ఎక్కువ ప్రశ్నించే చాన్స్ ఉంటుంది. ఎందుకంటారా..గతంలో ఏ కోచ్ ఉన్నపుడూ ఇలా జరగలేదు. అన్నిటికీ మించి గత కోచ్ రాహుల్ ద్రవిడ్ మంచి టీమ్‌ను సెట్ చేసి వెళ్లాడు. అఫ్‌కోర్స్ అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకే ఆ క్రెడిట్ దక్కుతుంది. కానీ ఇక్కడ విషయం అది కాదు, గంభీర్ రాగానే ఎందుకంత మార్పు వచ్చింది. ద్రవిడ్ కోచ్‌గా ఉన్నపుడు ఏదైతే టీమ్ ఉందో..ఇప్పుడూ అదే టీమ్ ఉంది. మరి రిజల్ట్‌లో ఇంత తేడానా? ఆటగాళ్ల దృక్పథం మారిందా? క్రమశిక్షణ తగ్గిందా? టీమ్ స్పిరిట్ దెబ్బతిందా? లేదంటే గెలిచీ, గెలిచీ బోర్ కొట్టిందా?.
ఊరుకోండి సార్..క్రికెట్‌లో ప్రతీ ఆటగాడికి, ప్రతీ టీమ్‌కి బ్యాడ్ డేస్ ఉండవా ..అని అంటారా? సరే ఆ నానుడి ఎప్పట్నుంచో ఉంది. అదీ నిజమే, కాకపోతే న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో ఆడిన ప్రతీ రోజూ బ్యాడ్ డేగా ఎలా మారిందనేదే ప్రశ్న. పోనీ సపోర్ట్ స్టాఫ్ నుంచి సరైన సపోర్ట్ దొరకలేదా? తనకు నచ్చిన వాళ్లనే సపోర్ట్ స్టాఫ్‌గా పెట్టుకున్నాడు కదా? అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉందని సర్దుకుపోలేం కదా..దీనికి కాయకల్ప చికిత్స కచ్చితంగా ఉండాల్సిందే. ఆస్ట్రేలియాలో ఆడబోయేబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐనా అంతా మంచే జరగాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు.
సరెసర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం
Categories: