ఎక్కడి వాళ్లనైనా ఓన్ చేసుకునే మంచితనం తెలుగు అభిమానులకు ఉంది. అది సినిమాలోనైనా, ఆటలోనైనా..సరే మనకు ఈ వేదికపై సినిమా టాపిక్ కాదు కాబట్టి, అది వదిలేద్దాం. క్రికెట్ విషయానికొస్తే.. అదీ తెలుగు ప్లేయర్స్ ఆడుతుంటే..అభిమానులను ఆపతరమా..ఇప్పటి వరకు తెలుగు గడ్డ నుంచి ఇండియాకు క్రికెట్ ఆడిన వాళ్లను చేతి వేళ్ల మీదే లెక్కబెట్టొచ్చు. వెంకటపతిరాజు, మహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమ విహారి, మహ్మద్ సిరాజ్, కేఎస్ భరత్..వీళ్లే ముఖ్యులు. తాజాగా నితీశ్‌కుమార్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స హైదరాబాద్ తరపున ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు. మొత్తానికి దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. ఇక మిగిలింది తన స్థానాన్ని కాపాడుకుంటూ టీమ్‌లో ఒక వెలుగు వెలగడమే. అది అంత ఈజీకాదని నితీశ్‌కూ తెలుసు.
టీ20 ఇంటర్నేషనల్స్ ఓకే, ఇక మిగిలింది టెస్టులు, వన్డేలే..మరి టెస్ట్ క్రికెట్ ఆడాలంటే దంచి కొట్టడమే కాదు, క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లకు నీళ్లు తాగించాలి. సరే ఇప్పుడున్న ట్రెండ్‌లో టెస్టుల్లోనూ బజ్ బాల్, జైస్‌బాల్ అంటూ చాలా సార్లు టీ20 ఆడేస్తున్నారు కనుక నితీశ్‌కు మంచి చాన్స్ ఉంది. అందుకే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియా టూర్‌నే టార్గెట్‌గా పెట్టారు. ఆస్ట్రేలియా ఏ జట్టుతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడే భారత ఏ జట్టులో నితీశ్‌కు చోటు దక్కింది. ఇందులో సత్తా చాటితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు రూట్ క్లియర్ అవుతుంది. అన్నిటీకి మించి ఆస్ట్రేలియా తెలుగు కుర్రాళ్లకు కలిసొచ్చే దేశమేమో..గతంలో వీవీఎస్ లక్ష్మణ్, మూడేళ్ల కిందట హనుమ విహారి ఆసీస్‌కు చుక్కలు చూపించిన విషయం గుర్తుందిగా. మరి నితీశ్ కూడా ఆ రేంజ్‌కు ఎదిగే చాన్స్ ఉంది. మరో విషయం ఇండియా ఏ జట్టులో ఇంకో తెలుగు క్రికెటర్ ఉన్నాడు, అతడే హైదరాబాదీ రికీ భుయ్…సరే పుట్టింది మధ్యప్రదేశ్‌లో ఐనా, సెటిల్ అయింది హైదరాబాద్‌లో, కొన్నేళ్లుగా హైదరాబాద్ తరపున ఇరగదీస్తున్నాడు. ఇతడి టాలెంట్‌కు కొదవలేదు..అదృష్టమొక్కటో కలిసి రావట్లేదు అంతే…ఇతగాడు ఆస్ట్రేలియా టూర్‌లో ఆకట్టుకుంటే టీమిండియాలో తెలుగు ప్లేయర్ల సంఖ్య పెరిగే చాన్స్ ఉంది.