బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో సపోజ్ ఇండియా ఓడితే ఓడొచ్చు గాక…పర్‌సపోజ్ చావుతప్పి కన్నులొట్టబోయినట్టు డ్రా చేసుకునే చాన్స్ ఉండొచ్చు గాక..అద్భుతమేదైనా జరిగి 2001లో కోల్‌కత టెస్టులో ఆస్ట్రేలియాపై వీరోచితంగా ఆడిన లక్ష్మణ్, ద్రవిడ్……కోహ్లీ, రోహిత్‌ను పూనవచ్చుగాక..ఏది జరిగినా అంతా టీమిండియా మంచికే అనుకోక తప్పదు. అదేంటి భయ్యా మరీ..46 రన్స్‌కే ఆలౌట్ అవడం ఏంటి, ఒక్క రోజులో 400 కొడతాం అన్నాడు కదా? ఇప్పుడేమైంది.. అనే దిక్కుమాలిన ప్రశ్నలు వదిలేస్తేనే మంచిది. అన్ని పరిస్థితులు, రోజులు మనవి కావు.
డబ్ల్యూటీసీ టైటిల్ ఎలాగూ ఊరిస్తున్నది కనుక..సొంతగడ్డపై వరుసగా 18 విజయాలంటూ విర్రవీగుతున్నాం కనుక..శ్రీలంకనే కొట్టలేకపోయిన న్యూజిలాండ్ మనల్నేమి చేస్తుందిలే అని ఏదో ఒక మూలన ఉన్నది కనుక..ఇలా చెంపమీద చెల్లుమని చరిచినట్టు..గాఢ నిద్రలో..గెలుపు మత్తులో ఉన్న ఇండియాకు హ్యాంగోవర్ దిగేలా చేసేంది న్యూజిలాండ్. ఇక తేరుకోవాల్సిందే, గెలుపు తాలూకూ సంబరాలు గుర్తు చేసుకోకుండా..ఎక్కడెక్కడ లోపాలున్నాయో రిపేర్ చేసుకుంటే సరి. బెంగళూరు రిజల్ట్ జానేదో, మీకు నచ్చినట్టు మీరు ఆడండి. ఐనా కొత్త కోచ్ గంభీరుడు హితబోధ చేసే ఉంటాడులే…బీప్‌లు వేసుకునే రేంజ్‌లో రోహిత్ ఎలాగూ ఎప్పటికప్పుడు సెట్ చేస్తుంటాడులే. బెంగళూరు టెస్ట్‌ను దేవుడికి వదిలేద్దాం సరదాగా..కరుణిస్తే సరేసరి, లేదంటే పుణె, ముంబైలో జరగబోయే టెస్టుల్లో చూసుకోవచ్చు. ఎంతైనా ఆప్టిమిస్ట్‌లం కదా.. మరక మంచిదే..46 కూడా మంచిదే..అనుకోవాలి